చెట్టినాడు చేపల పులుసు | చిక్కని స్పైసీ గ్రేవీతో ఉండే చెట్టినాడు చేపల పులుసు

 వీకెండ్స్లో లేదా ఎప్పుడైనా తృప్తిగా మాంచి చేపల పులుసు తినాలనుకుంటే చిక్కని స్పైసీ గ్రేవీతో ఉండే చెట్టినాడు చేపల పులుసు పర్ఫెక్ట్! చెట్టినాడు స్పెషల్ చేపల పులుసు రెసిపీ




వేడి వేడిగా అన్నంతో, ఇడ్లీ అట్టు, చపాతీతో చెట్టినాడు చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసు ప్రాంతాన్ని బట్టి ఒక్కో తీరుగా చేస్తారు, ఆంధ్రుల చేపల పులుసు పులుపు కారం పాళ్ళు ఎక్కువగా, కేరళ వారిది ఘాటుగా కమ్మగా ఉంటుంది. కానీ చెట్టినాడు చేపల పులుసు చిక్కగా కారంగా ఘాటుగా సువాసనతో ఉంటుంది.

చెట్టినాడు చేపల పులుసు రెసిపీ కూడా అన్నీ చేపల పులుసుల మాదిరే చేస్తారు, కానీ పులుసులో వేసే పదార్ధాలు వాటి మోతాదు భిన్నం అంతే! చెట్టినాడు చేపల పులుసు నాకు చాలా ఇష్టం. నిజానికి చెట్టినాడు చేపల పులుసు పేరుతో రెస్టారెంట్లలో మటన్ చికెన్కి వాడే గ్రేవీ స్టైల్లో చేస్తున్నారు, నిజానికి అలా ఉండదు అసలు చికెన్ మటన్కి వేసే మసాలాలు వేయరు.

మళ్ళీ చెప్తున్నాను తృప్తిగా చేపల పులుసు తినాలీ అనుకుంటే చెట్టినాడు చేపల పులుసు చేసి పెట్టండి, పొట్ట నిండడమే కాదు మనసు నిండిపోతుంది.

టిప్స్

1.నూనె – చేపల పులుసుకి నూనె ఉంటేనే రుచి, అప్పుడే నీచు వాసన రాదు, ఇంకా పులుసు రెండో రోజు తిన్నా రుచిగా ఉంటుంది.

  1. గ్రేవీ : గ్రేవీ రుచిగా రావాలంటే కచ్చితంగా ఓపికగా సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక ఉడికిస్తేనే రుచి.

3.పులుపు:ఈ పులుసులో పులుపు తెలిసి తెలియనట్లుగా ఉండాలి, అందుకే నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసిన పులుసు సరిపోతుంది.

4.చేపలు:ఈ పులుసుకి ఏ చేపలైనా వాడుకోవచ్చు, నేను బొచ్చ చేపల రకం వాడాను. నా దగ్గర చేప గుడ్లు ఉన్నాయి కాబట్టి పులుసులో వేశాను, దొరికితే మీరు వేసి పులుసు కాచండి చాలా బాగుంటుంది, లేకున్నా పర్లేదు.



కావాల్సిన పదార్ధాలు

  • చేపలు ఊరబెట్టడానికి
  • 1 tbsp కారం
  • 1/2 tsp మిరియాల పొడి
  • నీళ్ళు కొద్దిగా
  • ఉప్పు
  • 1/2 kilo చేప ముక్కలు
  • గ్రేవీ కోసం
  • 4 tbsp నూనె
  • 1/2 tsp మిరియాలు
  • 1/2 tsp సొంపు
  • 1/2 tsp జీలకర్ర
  • 10 వెల్లులి
  • ఎండుమిర్చి
  • ఉల్లిపాయ (finely chopped)
  • 1/4 tsp పసుపు
  • రెబ్బలు కరివేపాకు
  • 1/4 cup పచ్చి కొబ్బరి
  • 2 tbsp ధనియాల పొడి
  • 2.5 tbsp కారం
  • టొమాటో (finely chopped)
  • చింతపండు – నిమ్మకాయ సైజు అంత
  • పులుసు కోసం
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • వెల్లులి
  • రెబ్బలు కరివేపాకు
  • పచ్చిమిర్చి చీలికలు
  • 10 చిన్న ఉల్లిపాయలు
  • రాళ్ళ ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • కొత్తిమీర – చిన్న కట్ట

విధానం

  1. ప్లేట్లో కారం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్లా చేసి చేప ముక్కలకి రుద్ది పట్టించి వదిలేయండి
  2. ముకుడులో నూనె వేడి చేసి అందులో మిరియాలు, జీలకర్ర, సొంపు, ఎండు మిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా మూత వేపుకోవాలి.
  3. మెత్తబడ్డ ఉల్లిపాయాలో పచ్చి కొబ్బరి ముక్కలు ధనియాల పొడి, కారం, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి టొమాటోలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద మగ్గపెట్టండి.
  1. టొమాటోలు మగ్గి నూనె పైకి తేలేకా మిక్సీ జార్లోకి తీసుకుని చింతపండు నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి ఆవాలు చిటపటమనిపించాలి. ఆ తరువాత సొంపు, జీలకర్ర కరివేపాకు, వెల్లులి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. చింతపండు నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్, రాళ్ళ ఉప్పు, వేసి రంగు మారి నూనె పైకి తేలేదాక సన్నని సెగ మీద ఉడికిస్తే చిక్కని రుచికరమైన గ్రేవీ వస్తుంది.
  4. నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి గ్రేవీని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ పైన నూనె తేలుతుంది. అప్పుడు చేప ముక్కలు, ఉంటే చేప గుడ్లు నెమ్మది వేసి మూత పెట్టి సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  5. నూనె పైకి తేలాక పైన కొత్తిమీర తరుగు, కాడలతో సహా కరివేపాకు కాడలు వేసి స్టవ్ ఆపేసి గంట సేపు వదిలేయాలి. ఆ తరువాత వేడి అన్నం, చపాతీ, దోశా ఇడ్లీతో సర్వ చేసుకోండి



Comments

Popular posts from this blog

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

గోంగూర పనీర్

కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes